కొరోనావైరస్ వ్యాప్తి మొదలైన నాటినుండే, ఇది ప్రయోగశాలలో తయారైన వైరసేనన్న పుకార్లు కూడా అంతకన్నా వేగంగా వ్యాప్తి చెందాయి. అమెరికాలో ఒకరు ఇది చైనాలోని వూహాన్ లో నాలుగో స్థాయి బయోసేఫ్టీ ప్రయోగశాలలో తయారయ్యిందన్న వదంతిని లేవనెత్తారు. నాలుగో స్థాయి బయోసేఫ్టీ శాలలు ఇబోలా వంటి అతి ప్రమాదకరమైన వైరసులను పరీక్షించి, పరిశోధించే ప్రయోగశాలలు. ఇటువంటి ప్రయోగశాలలలో భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. అటువంటి ప్రయోగశాల ఒకటి వూహాన్ లో ఉన్నంత మాత్రాన ఇతర ఏ ఆధారాలు లేకుండా ఆ వైరస్ ఆ ప్రయోగశాలలోనే సృష్టించి, విడుదల చేసారని నిర్ధారించలేము.
అలాగే, కొంతమంది చైనీయులు ఈ వైరస్ అమెరికా సైన్యవిభాగం వారు సృష్టించారని ఆరోపిస్తూ వదంతులను ప్రచారం చేసారు. కానీ ఈ వైరస్ల మీద పనిచేసే శాస్త్రవేత్తలు మాత్రం ఎన్-కోవిడ్19 మానవనిర్మిత వైరస్ కాదని, గబ్బిలం, అలుగు వంటి జంతువులనుండి సోకే వైరసులకు దీనికి ఎంతో సామ్యం కనిపిస్తోందని అంటున్నారు. నిజంగా ఎన్-కోవిడ్19 మనుష్యులను చంపడానికి తయారు చేసిన జీవాయుధమే (bio-weapon) అయ్యింటే ఇంతకుముందే తెలిసిన అత్యంత ప్రమాదకరమైన క్రిములను మార్చి మానవులకు మరింత ముప్పు వాటిల్లజేసే మారణాయుధంగా తయారు చేసుండేవారు. కానీ, ఈ వైరస్ జన్యుకణాలను (RNA) క్షుణ్ణంగా పరిశోధించిన శాస్త్రవేత్తలు ఈ వైరస్ యొక్క వంశవృక్షాన్ని తయారుచేయగలిగారు. ఈ వంశవృక్ష సాయంతో దీని పుట్టుపూర్వోత్తరాలు వివరంగా చెప్పవచ్చు. ఈ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది కచ్చితంగా గబ్బిలం, అలుగు వంటి జంతువులనుండి సూటిగా మానవులలోకి ప్రవేశించింది.
జీవాయుధం (bio-weapon) అంటే ఏమిటి?
మనకు చరిత్రలో జీవాయుధులను (bio-weapons) ప్రయోగశాలలో తయారుచేసి మారణాయుధాలుగా విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఇటువంటి సందర్భాల్లో విషపూరిత బ్యాక్టీరియాలను, క్రిములను తయారుచేసి వాటిని జీవాయుధులుగా వాడుకొన్నారు. ఆంత్రాక్స్ (Anthrax) జబ్బును కలగజేసే బాసిలస్ అంత్రాసిస్ (Bacillus anthracis) అన్న బ్యాక్టీరియా క్రిములు ఇందుకు ఒక ఉదాహరణ.
అయితే, ఇటువంటి విషపూరిత జీవయుధాలు సోకిన మనుష్యులు తీవ్రంగా జబ్బు పడి మరణిస్తారు. ఆంత్రాక్స్ వంటి జీవయుధాలు సోకిన మనుష్యులు బ్రతికి బయటపడడానికి అవకాశం చాలా తక్కువ. ఇటువంటి జీవాయుధాలు యుద్ధ సమయంలో శత్రుసైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగిస్తారు.
ఎన్-కోవిడ్19 ప్రమాదకరమైన వైరసే కానీ, జీవాయుధాల లాగా మరణ శాతం చాలా ఎక్కువ కాదు. కాబట్టి జన్యుకణాల పరిశోధన ఆధారంగా చూసినా, మరణశాత సంఖ్యలను చూసినా, ఎన్-కోవిడ్19 మానవ నిర్మిత జీవాయుధం అని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు.