రోగనిరోధక శక్తి అన్నది పేరు సూచించునట్టుగా బాహ్య రోగక్రిముల బారినుండి మనలను కాపాడే శారీరక వ్యవస్థ. మన దేహంలో ఉండే అణువులు, కణాలు ఒక బలగంగా మారి మనకు ఒక రక్షా కవచాన్ని ఏర్పరుస్తాయి. ఇవి బయటనుండి శరీరంలోకి ప్రవేశించే ఏ రోగ క్రిములతోనైనా, పదార్థంతోనైనా పోరాడుతాయి. రోగనిరోధక వ్యవస్థలో ఉండే కణాలు పరాన్నజీవి అయిన క్రిముల పైనున్న కణాలకు అంటుకొని అవి మన శరీరమంతా సోకకుండా తప్పించడానికి ప్రయత్నిస్తాయి. కొన్ని రోగనిరోధకశక్తి కణాలు రోగకారక క్రిములనుండి మనలను దీర్ఘకాలానికి రక్షణనిస్తాయి. మనుష్యులకే కాక ఇతర జంతువులలోనూ, చెట్లలోనూ ఈ రకమైన రోగనిరోధక శక్తి కనిపిస్తుంది.
వైరసుల బారినుండి కాపాడే రోగనిరోధక శక్తి మనకు ఉందా?
ఒక వైరసు కణం మనకు సోకినప్పుడు, మన జీవకణాలు, ప్రోటీన్ కణాలు ఆ వైరసు కణానికి విరుద్ధంగా పోరాడి అది మిగిలిన కణాలకు సోకకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. మన శరీరంలోని రోగనిరోధక శక్తికణాల ప్రోటీను వైరసు కణంలోని ప్రోటీనును అంటుకొని దాని ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అయితే, మన శరీరానికి తెలియని కొత్త వైరసు కణాలు ఈ రోగనిరోధకశక్తి కణాల నుండి తప్పించుకొని శరీరంలోని ఇతర భాగాలకు సోకడానికి ప్రయత్నిస్తాయి.
టీకాలు ఎందుకు అవసరం?
కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్దిష్ట రోగకారక క్రిములతో పోరాడడానికి మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి టీకాలు ఉపయోగపడతాయి. రోగకారక క్రిముల శక్తిని హాని చేయనంతగా బాగా తగ్గించి ఆ బలహీన క్రిములను మన శరీరంలోకి టీకాల ద్వారా ఎక్కిస్తారు. కొన్నిసార్లు చనిపోయిన క్రిముల భాగాలను కూడా మనకిచ్చే టీకాలలో కలుపుతారు. ఈ టీకాల ద్వారా ప్రవేశించిన బలహీన క్రిముల కణాలు మన రోగనిరోధక శక్తిని ఉత్తేజం చేసి ఈ క్రిముల తత్త్వాన్ని తెలుసుకొని పోరాడడానికి పురికొల్పుతాయి. అయితే, ఈ రకమైన టీకాలు ఆ నిర్దిష్ట క్రిములతో పోరాడడానికి పనికివస్తాయి తప్ప అన్ని వైరసులను నివారించలేవు. మశూచికం, పొంగు (chickenpox) వంటి రోగాలకు ఇచ్చే టీకాలు వీటికి ఉదాహరణలు.
మన శరీరాల్లో ఈ కొత్త కొరోనా వైరసుతో పోరాడి నివారించే రోగనిరోధక శక్తి లేదు. అలాగే, ఈ కొత్త కొరొనా వైరసునుండి కాపాడి మన రోగనిరోధకశక్తిని పెంచే టీకాలు ఇంకా రాలేదు. అందుకనే ఈ మహమ్మారి నుండి కాపాడుకోవడానికి సామాజిక దూరం, చేతుల శుభ్రత, మొదలైన నివారణ చర్యలు పాటించడం తప్పనిసరి.
