సంతానోత్పత్తి వ్యవస్థలో భాగంగా పరిగణించబడే అవయవాలలో నెలనెల జరిగే జీవ మార్పులు ఋతు చక్రం లో భాగం. ఇది అండాశయాలు (ovaries), గర్భాశయం (uterus), మరియు యోని (vagina) వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవాలు కలిగి ఉన్న వ్యక్తులలో కనిపించే సహజ ప్రక్రియ. ప్రతి నెల, అండాశయాలు ఒక అండం (Ova or egg) అని పిలువబడే ప్రత్యేక బీజ కణాలు ఉత్పత్తి చేస్తాయి. ఇలా విడుదలైన అండం లైంగిక సంపర్కం సమయంలో శుక్రంతో (sperm) ఫలదీకరణం (fertilize) చెంది గర్భకోశంలో పిండంగా తయారవుతుంది.

ఆ పిండం గర్భాశయం (గర్భం) యొక్క గోడకు అతుక్కుపోతుంది. గర్భం దాల్చే సమయంలో క్రమంగా కొత్త శిశువుగా ఎదిగి చివరికి కాన్పు/ప్రసవంతో బయటకు వస్తుంది. అందుకే, ప్రతి నెల, అండం విడుదల అయ్యే ముందు బిడ్డసంచిలో ఫలదీకరణం చెందిన అండం అభివృద్ధి చెందడానికి అనువైన ప్రదేశంగా తయారవుతుంది. ఇందుకోసం గర్భాశయం యొక్క గోడ రక్తనాళాలతో నిండి మందంగా తయారవుతుంది. పిండం గర్భాశయం గోడలకు అతుక్కుని ఉండి జీవించడానికి, పెరగడానికి అవసరమైన పోషణను అందుకుంటుంది. అండం శుక్రంతో ఫలదీకరణం చెందకపోతే అంటే గర్భధారణ జరగని పరిస్థితుల్లో అది స్రావమైపోతుంది. గర్భాశయం లోని గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ (Endometrium) అనే లోపలి పొర పీరియడ్ బ్లడ్ రూపంలో ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం, బహిష్టు, నెలసరి అంటారు.
సాధారణంగా డిశ్చార్జి లేదా బహిష్టు, రక్తం, రక్తపు గడ్డలు, గర్భాశయ గోడ నుండి స్రవించే కణజాలం, నీరు, శ్లేష్మం మరియు బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. సాధారణంగా రక్తంలో ఐరన్, కాపర్ ఉండటం, అలాగే, ఆరోగ్యకరమైన యోనిలో నివసించే బ్యాక్టీరియా ఉండటం వల్ల పీరియడ్ బ్లడ్ వాసన వస్తుంది.