ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు రోగనిరోధక శక్తిని పెంచలేవు.

COVID19 మహమ్మారి సమయంలో, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు ఒక ప్రముఖ వ్యక్తిగత సంరక్షణగా మారాయి. సబ్బు మరియు నీరు అందుబాటులో లేనప్పుడు చేతులు శుభ్రం చేయడానికి హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించవచ్చని CDC(వ్యాధి నియంత్రణ కేంద్రం) భావించింది. ఈ ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లలో చాలా వరకు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఉంటాయి.

ఆల్కహాల్ బ్యాక్టీరియా యొక్క కణ త్వచాల నిర్మాణాన్ని మరియు వైరస్ల కవచాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల, కఠినమైన ఉపరితలాలు లేదా చర్మంపై ఆల్కహాల్ స్ప్రే చేస్తే, వాటిపై ఉన్న ఈ రోగకారక క్రిములు చాలా వరకు చంపబడతాయి. అందువల్ల ఆల్కహాల్, ఉపరితలాలను శుభ్రపరచడానికి క్రిమిసంహారక మందుగా లేదా సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి, గాయాలను శుభ్రపరిచే క్రిమినాశక మందుగా ఉపయోగించబడింది.

కానీ ఆల్కహాలుకి పరిమితులు ఉన్నాయి. పదేపదే వాడటం వలన, పొరపాటున ఇది కళ్ళలోకి ప్రవేశిస్తే, పొడిబారడం మరియు చికాకు కలిగిస్తుంది.

చాలా ఆల్కహాల్ శానిటైజర్ కంపెనీలు ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి అనేది మన శరీరం బయట నుండి వచ్చే వ్యాధుల సంక్రమణకు వ్యతిరేకంగా మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ అందించే రక్షణ. ఆల్కహాల్ వంటి క్రిమిసంహారకాలు ఉపరితలాలను శుభ్రపరుస్తాయి లేదా వాటిపై ఉన్న చాలా వ్యాధికారక క్రిములను చంపుతాయి. దీని వలన మన శరీరంలోకి సూక్ష్మక్రిములు ప్రవేశించే అవకాశం తగ్గుతుంది. ఇప్పటికే మనలోకి ప్రవేశించిన మరియు సోకిన సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరును ప్రభావితం చేయడంలో ఆల్కహాల్ పాత్ర లేదు.

రోగనిరోధక శక్తి అంటే ఏమిటి?

రోగనిరోధక శక్తి అన్నది పేరు సూచించునట్టుగా బాహ్య రోగక్రిముల బారినుండి మనలను కాపాడే శారీరక వ్యవస్థ. మన దేహంలో ఉండే అణువులు, కణాలు  ఒక బలగంగా మారి మనకు ఒక రక్షా కవచాన్ని  ఏర్పరుస్తాయి. ఇవి బయటనుండి శరీరంలోకి ప్రవేశించే ఏ రోగ క్రిములతోనైనా, పదార్థంతోనైనా పోరాడుతాయి. రోగనిరోధక వ్యవస్థలో ఉండే కణాలు పరాన్నజీవి అయిన క్రిముల పైనున్న కణాలకు అంటుకొని అవి మన శరీరమంతా సోకకుండా తప్పించడానికి ప్రయత్నిస్తాయి. కొన్ని రోగనిరోధకశక్తి కణాలు రోగకారక క్రిములనుండి మనలను దీర్ఘకాలానికి రక్షణనిస్తాయి. మనుష్యులకే కాక ఇతర జంతువులలోనూ, చెట్లలోనూ ఈ రకమైన రోగనిరోధక శక్తి కనిపిస్తుంది.

వైరసుల బారినుండి కాపాడే రోగనిరోధక శక్తి మనకు ఉందా?

ఒక వైరసు కణం మనకు సోకినప్పుడు, మన జీవకణాలు, ప్రోటీన్ కణాలు ఆ వైరసు కణానికి విరుద్ధంగా పోరాడి అది మిగిలిన కణాలకు సోకకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. మన శరీరంలోని రోగనిరోధక శక్తికణాల ప్రోటీను వైరసు కణంలోని ప్రోటీనును అంటుకొని దాని ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అయితే, మన శరీరానికి తెలియని కొత్త  వైరసు కణాలు ఈ రోగనిరోధకశక్తి కణాల నుండి తప్పించుకొని శరీరంలోని ఇతర భాగాలకు సోకడానికి ప్రయత్నిస్తాయి. 

టీకాలు ఎందుకు అవసరం?

కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్దిష్ట రోగకారక క్రిములతో పోరాడడానికి మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి టీకాలు ఉపయోగపడతాయి. రోగకారక క్రిముల శక్తిని హాని చేయనంతగా బాగా తగ్గించి ఆ బలహీన క్రిములను మన శరీరంలోకి టీకాల ద్వారా ఎక్కిస్తారు. కొన్నిసార్లు చనిపోయిన క్రిముల భాగాలను కూడా మనకిచ్చే టీకాలలో కలుపుతారు. ఈ టీకాల ద్వారా ప్రవేశించిన బలహీన క్రిముల కణాలు మన రోగనిరోధక శక్తిని ఉత్తేజం చేసి ఈ క్రిముల తత్త్వాన్ని తెలుసుకొని పోరాడడానికి పురికొల్పుతాయి. అయితే, ఈ రకమైన టీకాలు ఆ నిర్దిష్ట క్రిములతో పోరాడడానికి పనికివస్తాయి తప్ప అన్ని వైరసులను నివారించలేవు. మశూచికం, పొంగు (chickenpox) వంటి రోగాలకు ఇచ్చే టీకాలు వీటికి ఉదాహరణలు.   

మన శరీరాల్లో ఈ కొత్త కొరోనా వైరసుతో పోరాడి నివారించే రోగనిరోధక శక్తి లేదు. అలాగే, ఈ కొత్త కొరొనా వైరసునుండి కాపాడి మన రోగనిరోధకశక్తిని పెంచే టీకాలు ఇంకా రాలేదు. అందుకనే ఈ మహమ్మారి నుండి కాపాడుకోవడానికి సామాజిక దూరం, చేతుల శుభ్రత, మొదలైన నివారణ చర్యలు పాటించడం తప్పనిసరి.   

ఎన్-కోవిడ్19 జీవాయుధం (bio-weapon) కాదు. ఎందుకంటే

కొరోనావైరస్ వ్యాప్తి మొదలైన నాటినుండే, ఇది ప్రయోగశాలలో తయారైన వైరసేనన్న పుకార్లు కూడా అంతకన్నా వేగంగా వ్యాప్తి చెందాయి. అమెరికాలో ఒకరు ఇది చైనాలోని వూహాన్ లో నాలుగో స్థాయి బయోసేఫ్టీ ప్రయోగశాలలో తయారయ్యిందన్న వదంతిని లేవనెత్తారు.  నాలుగో స్థాయి బయోసేఫ్టీ శాలలు ఇబోలా వంటి అతి ప్రమాదకరమైన వైరసులను పరీక్షించి, పరిశోధించే ప్రయోగశాలలు. ఇటువంటి ప్రయోగశాలలలో భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. అటువంటి ప్రయోగశాల ఒకటి వూహాన్ లో ఉన్నంత మాత్రాన ఇతర ఏ ఆధారాలు లేకుండా ఆ వైరస్ ఆ ప్రయోగశాలలోనే సృష్టించి, విడుదల చేసారని నిర్ధారించలేము. 

అలాగే, కొంతమంది చైనీయులు ఈ వైరస్ అమెరికా సైన్యవిభాగం వారు సృష్టించారని ఆరోపిస్తూ వదంతులను ప్రచారం చేసారు. కానీ ఈ వైరస్ల మీద పనిచేసే శాస్త్రవేత్తలు మాత్రం ఎన్-కోవిడ్19 మానవనిర్మిత వైరస్ కాదని, గబ్బిలం, అలుగు వంటి జంతువులనుండి సోకే వైరసులకు దీనికి ఎంతో సామ్యం కనిపిస్తోందని అంటున్నారు. నిజంగా ఎన్-కోవిడ్19 మనుష్యులను చంపడానికి తయారు చేసిన జీవాయుధమే (bio-weapon) అయ్యింటే ఇంతకుముందే తెలిసిన అత్యంత ప్రమాదకరమైన క్రిములను మార్చి మానవులకు మరింత ముప్పు వాటిల్లజేసే మారణాయుధంగా తయారు చేసుండేవారు. కానీ, ఈ వైరస్ జన్యుకణాలను (RNA) క్షుణ్ణంగా పరిశోధించిన శాస్త్రవేత్తలు ఈ వైరస్ యొక్క వంశవృక్షాన్ని తయారుచేయగలిగారు. ఈ వంశవృక్ష సాయంతో దీని పుట్టుపూర్వోత్తరాలు వివరంగా చెప్పవచ్చు. ఈ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది కచ్చితంగా గబ్బిలం, అలుగు వంటి జంతువులనుండి సూటిగా మానవులలోకి ప్రవేశించింది.

జీవాయుధం (bio-weapon) అంటే ఏమిటి?

మనకు చరిత్రలో జీవాయుధులను (bio-weapons) ప్రయోగశాలలో తయారుచేసి మారణాయుధాలుగా విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఇటువంటి సందర్భాల్లో విషపూరిత బ్యాక్టీరియాలను, క్రిములను తయారుచేసి వాటిని జీవాయుధులుగా వాడుకొన్నారు. ఆంత్రాక్స్ (Anthrax) జబ్బును కలగజేసే బాసిలస్ అంత్రాసిస్ (Bacillus anthracis) అన్న బ్యాక్టీరియా క్రిములు ఇందుకు ఒక ఉదాహరణ. 

అయితే, ఇటువంటి విషపూరిత జీవయుధాలు సోకిన మనుష్యులు తీవ్రంగా జబ్బు పడి మరణిస్తారు. ఆంత్రాక్స్ వంటి జీవయుధాలు సోకిన మనుష్యులు బ్రతికి బయటపడడానికి అవకాశం చాలా తక్కువ. ఇటువంటి జీవాయుధాలు యుద్ధ సమయంలో శత్రుసైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగిస్తారు. 

ఎన్-కోవిడ్19 ప్రమాదకరమైన వైరసే కానీ, జీవాయుధాల లాగా మరణ శాతం చాలా ఎక్కువ కాదు. కాబట్టి జన్యుకణాల పరిశోధన ఆధారంగా చూసినా, మరణశాత సంఖ్యలను చూసినా, ఎన్-కోవిడ్19 మానవ నిర్మిత జీవాయుధం అని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు. 

దోమలు కొరోనా ను వ్యాపింపజేయవు.

కొరోనా వైరస్ మనుషుల యొక్క శ్వాశకోశవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దోమలు డెంగ్యూ మరియు చికెంగున్యా లాంటి వ్యాధులను కలగజేస్తాయని తెలిసిన విషయమే, కానీ ఇవి  కొరోనా వైరస్ ని వ్యాపింపజేయవు. కొరోనా వైరస్ ఉన్న మనుషులను కుట్టిన దోమలు, వేరే మనుషులకు వ్యాప్తి చేయలేవు. ఈ వైరస్ దగ్గు మరియు తుమ్మడం వలన వచ్చే తుంపరల వలన, లాలాజలం మరియు చీముడు ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఇప్పటి వరకు ఆధారాలు లేవు. ఈ వైరస్ సోకిన వారి నుండి సామాజిక దూరాన్ని పాటించడం వలన దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. సామాజిక దూరం అంటే ఈ వైరస్ సోకిన లేదా లక్షణాలు ఉన్న వారి నుండి మరియు వారు వాడిన వస్తువులకు దూరంగా ఉండటం.  ఈ వైరస్ సోకిన వారికి ఉండే సాధారణ లక్షణాలు: పొడిదగ్గు, జ్వరం మరియు అలసట.

వైరస్ అంటే ఏమిటి?

వైరస్ ఒక చిన్న, ప్రాణములేని జీవి. ఇది ప్రాణం ఉన్న బ్యాక్టీరియా, మొక్కలు మరియు ఇతర జీవులకు సోకి రకరకాల వ్యాధులను కలగజేస్తుంది. కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. మానవ శరీరాల మాదిరిగా, వైరస్లు కణాలను కలిగి ఉండవు అందువల్ల వాటి జనాభాని పెంచుకోవటం కోసం వాటికి ఒక కణం అవసరం. వైరస్ నిర్మాణం లో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి: వైరస్ గురించి సమాచారాన్ని కలిగి ఉన్న రసాయన నిర్మాణం, దాని చుట్టూ ఒక రక్షణ కవచం, మరియు బయటి తొడుగు. జీవుల నుండి భిన్నంగా ఉన్నప్పటికీ, వైరస్లు మరియు జీవుల మధ్య ఉన్న సారూప్యత ఏమిటంటే అవి రెండూ జన్యు సమాచార రసాయన నిర్మాణాలను కలిగి ఉంటాయి (జీవులలో DNA మరియు RNA, వైరస్లో RNA మాత్రం). ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఉన్న మన కణాలని వాడుకొని ప్రతిరూపం చెందుతుంది. పునరుత్పత్తి తరువాత కణాలు పగిలి వైరస్ ఇతర కణాలకు వ్యాపిస్తుంది. కొన్నిసార్లు బహుళ కాపీలను సృష్టించేటప్పుడు, రసాయన నిర్మాణాల(RNA) ద్వారా తీసుకువెళ్ళబడిన సమాచారం మారవచ్చు. అందుకే దీనిని నయం చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. SARS, ఇన్ఫ్లుఎంజా వైరస్ మరియు n-COVID 19 మానవులను ప్రభావితం చేసిన వైరస్లకు కొన్ని ఉదాహరణలు. ప్రస్తుత n-COVID 19 వైరస్ గతంలో జంతువులకు సోకింది తర్వాత చైనాలోని జంతువుల మార్కెట్ ద్వారా ఇది మానవులకు సోకింది.